నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర
- ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ కార్యక్రమం.. ఏర్పాట్లను పరిశీలించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను వివరించేందుకు నవంబర్ 3న నిర్మల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం
చేస్తున్నారు.మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్న నేపథ్యంలో, ఆయన రాక సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్ల కోసం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధిత స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు. సభకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో వేగం పెంచాలని ఆయన సూచించారు.
ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రమణారెడ్డి, సరికెల గంగన్న, శ్రీనివాస్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్, జింక సురేందర్, ఈశ్వర్, కూన శశాంక్, సూరజ్ నాయక్, నాయకులు కందుల హరీష్, భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
