ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పోరాటానికి వైద్యుల మద్దతు
- 19వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఐఎంఏనేతల హామీ. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి......
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్మల్ శాఖ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ఐఎంఏ నిర్మల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ జి. రమేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. కృష్ణంరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ యు. రామకృష్ణ హాజరై సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఉద్యోగులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు.అదేవిధంగా మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, ప్రతి సంవత్సరం 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, 8 శాతం లాయల్టీ బోనస్ చెల్లించాలని సూచించారు.
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు, వారి సమస్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వైద్యులు హామీ ఇచ్చారు.
