ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలి
- ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకె ప్రభాకర్ మాదిగ
ప్రజలకు నిరంతరం వైద్య సేవలందిస్తూ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకె ప్రభాకర్ మాదిగ డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా ఆర్డీవో కార్యాలయం ఎదుట గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, వేతనాల పెంపు, ప్రసూతి సెలవులు తదితర న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
గత పదేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి తెలంగాణలోనూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
జీవో 510 ద్వారా వేతనాల పెంపు ప్రయోజనం పొందని ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెంటనే సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల 19వ రోజు సమ్మెకు మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్ నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి కత్తి విష్ణు, కళాకారుడు దరువు భోజన్నతో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.
