ప్రకృతి సేద్యానికి కలబంద వరప్రదాయిని
- నీటి ఎద్దడిని తట్టుకునేలా పంటలకు రక్షణ.. కలబందతో సేంద్రియ ద్రావణం తయారీపై రైతులకు అవగాహన
రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంలో కలబంద మొక్కలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. శనివారం లోకల్ వెల్మల్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు రబీ సీజన్‌లో సాగు చేయనున్న పంటలను ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలబందలో మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సహజ సేంద్రియ పదార్థాలు, వృద్ధి నియంత్రకాలు, విటమిన్లు, సూక్ష్మపోషకాలు, జిగురు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. వీటిని వ్యవసాయంలో తగిన పద్ధతిలో వినియోగించడం ద్వారా పంటల ఎదుగుదలకు, చీడపీడల ప్రభావాన్ని తగ్గించేందుకు, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయంలో అందుబాటులో ఉన్న స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని, ఈ నేపథ్యంలో కలబంద రైతులకు ఉపయోగకరమైన మొక్కగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం కలబంద గుజ్జు, పాలు, బెల్లం మిశ్రమంతో సేంద్రియ కలబంద ద్రావణాన్ని తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించి, దాని వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, కృషి సఖీలు జ్యోతి, స్వప్నతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
