నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
- గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి..... పెండింగ్ కేసుల పరిష్కారం....., గంజాయి నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలి........ శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా కొనసాగించాలి.....
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి. శ్రీనివాస్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికినారు.
అనంతరం కార్యాలయ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. గ్రేవ్, పోక్సో కేసులతో పాటు దర్యాప్తులో ఉన్న, పెండింగ్‌లో ఉన్న, ట్రయల్ దశలో ఉన్న కేసుల సీడీ ఫైళ్లను సమీక్షించి, నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ప్రతి కేసులో ఎస్‌ఓపీ (SOP) పాటించాలని డీఎస్పీ పి. శ్రీనివాస్ కి సూచించారు.
కార్యాలయంలో 5S విధానాన్ని అమలు చేస్తూ ఫైళ్లు, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని, పోలీస్ స్టేషన్లను తరచుగా తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.
రౌడీషీటర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని డీఎస్పీకి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, కృష్ణ, ఎస్‌ఐ లింబాద్రి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
