ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి ఘన నివాళులు
- దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం – కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు
నిర్మల్ అక్టోబర్ 31 సాక్షర ప్రతినిధి
భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని కూచాడి శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ......... భారత రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ దేశ పరిపాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులకు బాటలు వేశారని గుర్తుచేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న నాయకురాలిగా ఇందిరా గాంధీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఆమె దేశానికి అందించిన సేవలు, చేసిన త్యాగాలు, ప్రజల పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి, ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీహరి రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇందిరా గాంధీ అభిమానులు తదితరులు పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
