ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్., డిజిటల్ గవర్నెన్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్, డిజిటల్ గవర్నెన్స్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో హెచ్ ఓ ఓ లు, డి డి ఓ లు, మండల స్థాయి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిపాలన అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్ ద్వారా అన్ని బిల్లుల సమర్పణ డిజిటల్ విధానంలో కొనసాగుతుందని, 2027 జనవరి 1వ తేదీ నుంచి మాన్యువల్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి, ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటల్ విధానంలోనే నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లలో చేయవలసిన అన్ని వివరాల నమోదు, అప్‌డేషన్లను పూర్తి చేయాలని సూచించారు. జనవరి 1వ తేదీ నుంచి ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని తెలిపారు. శిక్షణలో భాగంగా ఈ.ఎస్.ఆర్. లో ఉద్యోగుల వివరాల నమోదు, నియామకాలు, పోస్టింగులు, సెలవుల దరఖాస్తు, సెలవుల రద్దు తదితర అంశాలను తెలుసుకోవాలని, వివరాల నమోదు, ఆమోదం సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
