ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 1 వేయి 734 పనులు చేపట్టగా 1 వేయి 175 పనులు పూర్తి కాగా 475 పనులు పురోగతిలో ఉన్నాయని, సమగ్ర శిక్ష పరిధిలో 4 వేల 266 పనులు చేపట్టగా 3 వేల 78 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 25 పాఠశాలలకు 2 కోట్ల 49 లక్షల రూపాయల నిధులు విడుదల కాగా, ఇప్పటి వరకు 79.48 లక్షల రూపాయలు ఖర్చు చేసి 32 శాతం నిధుల వినియోగం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన 52 పనులలో 29 పూర్తి కాగా, మిగిలిన 23 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి త్రాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలు తదితర సదుపాయాలను పరిశీలించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని, అవసరమైన ప్రాంతాలలో బోర్ల మరమ్మతులు, ఫ్లషింగ్, లోతు పెంపు పనులు చేపట్టాలని, ప్రత్యామ్నాయ వనరులు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో త్రాగునీటి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి హ్యాండ్ పంపులు, బోర్లు, మోటార్లు, ఓపెన్ వెల్స్ తదితర నీటి వనరుల మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక ఆవాసాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.
వి బి జి రామ్ జి పథకం క్రింద చేపట్టే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మార్చి నెలాఖరుకు 12 లక్షల పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలని తెలిపారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, దివ్యాంగులకు సంబంధించిన 6 కేటగిరీలలో 5 లక్షల 95 వేల 532 దరఖాస్తులు రాగా 5 లక్షల 57 వేల 289 దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని, దరఖాస్తులను 360 డిగ్రీ డేటా ఇంటిగ్రేషన్ ద్వారా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు నూతన లోగోతో కూడిన స్టిక్కర్లు అతికించాలని, నూతన ఇందిరమ్మ ఇండ్లలో జరిగే వేడుకలను సోషల్ మీడియా ఖాతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. 2వ విడతలో భాగంగా మొత్తం 2 లక్షల ఇళ్ల కేటాయింపు లక్ష్యంలో 43 వేల 730 ఇండ్లకు మంజూరు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన అర్హుల గుర్తింపు, మంజూరు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. 2 పడక గదుల ఇండ్ల పథకం క్రింద పూర్తయిన, పూర్తికి చేరువలో ఉన్న 41 వేల 840 ఇళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని, సీనరేజ్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 'మన ఇసుక వాహనం' యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని, సిమెంట్ బస్తాను 230 రూపాయలకే అందించే సదుపాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా దాదాపు 10 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నిర్మాణ సామగ్రి సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని, నవంబర్ 4, 2026 నాటికి నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 441 ప్రాజెక్టులకు సంబంధించి 4.05 లక్షల ఎకరాల సేకరణకు ప్రతిపాదించగా 3 లక్షల 30 వేల ఎకరాలకు అవార్డు జారీ జరిగిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, భూముల స్వాధీనం, భూభారతిలో నమోదు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, చేయూత పింఛన్లు, భూ సేకరణ పనులను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
