ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
- వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ముందస్తు వైద్య పరీక్షలతో అనారోగ్య సమస్యలను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు.
సోమవారం నిర్మల్ కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించి వైద్య పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మనకు తెలియకుండానే శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని ముందుగానే గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు వినియోగించడంతో పాటు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని అన్నారు. ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతిరోజూ శారీరక వ్యాయామం, యోగా చేయడాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్త పరీక్షలు పూర్తయ్యే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
