- సొంత కుటుంబసభ్యుల్లా ఆదరించిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
నిత్యం ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా కోసం శ్రమిస్తున్న శ్రామికుల ఇళ్లలో పండుగ వెలుగులు నింపాలన్న సంకల్పంతో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ దసరా పండుగను పురస్కరించుకుని ఆదర్శనీయ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. అమీన్‌పూర్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ (వాటర్ బోర్డు) కార్మికులు సుమారు 450 మందికి తన నివాసంలో కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మహిళా కార్మికులకు చీరలు, పురుషులకు షర్టులు అందజేసి ఆత్మీయంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. ఎండనక, వాననక నిత్యం రహదారులను శుభ్రపరుస్తూ, తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా శ్రమిస్తున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తెలంగాణలో పెద్ద పండుగైన విజయదశమిని వారు కూడా తమ కుటుంబాలతో కలిసి ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే వారిని సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్మికుల మోములో చిరునవ్వు చూడటమే తమ కుటుంబానికి నిజమైన పండుగ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల సేవలో ఉండే తమ శ్రమను గుర్తించి, పండుగ వేళ పెద్ద దిక్కుగా నిలిచి గౌరవించినందుకు నందారం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్న నరసింహ గౌడ్ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో వారు మరింత ఉన్నత పదవులు అధిష్టించి ప్రజాసేవలో ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎన్ జి యువసేన సభ్యులు ఇంద్రేశం ప్రకాష్, ముదిరాజ్, ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నందారం శ్రీనివాస్ గౌడ్, దాసు యాదవ్, శేఖర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మల్లేష్, భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రముఖులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter