📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS పౌల్ట్రీ ఫారమ్‌ల నిర్వహణపై నిఘా ఏదీ?
‹
›
District News

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
  • సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో బాలల భద్రత, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం
నిర్మల్ అక్టోబర్ 30 సాక్షర ప్రతినిధి.
బాలల హక్కుల పరిరక్షణకు,వారిపై జరిగే లైంగిక నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. బాలలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ,వారు భయం లేకుండా గౌరవంగా జీవించే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్మల్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ,బాలలపై లైంగిక నేరాల నిరోధం,బాలల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీరవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం, బాలల హక్కులను కాపాడటం, బాల్యవివాహాలను నిరోధించడం, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం వంటి అంశాలపై విద్యార్థులకు,ప్రజలకు అవగాహన కల్పించారు.
వక్తలు మాట్లాడుతూ,బాలలపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం–2012 కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పిల్లలపై ఏదైనా నేరం జరిగినట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు చట్టప్రకారం సమాచారం అందించాలని,బాధిత బాలల వ్యక్తిగత వివరాలు బయటపెట్టకుండా వారి గోప్యతను కాపాడాలని సూచించారు.
బాల్యవివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.బాల్యవివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
బాలలపై వేధింపులకు గురైన బాధితులకు అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్,న్యాయ సహాయం అందించడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రతి బాలుడు, ప్రతి బాలిక భయం లేకుండా, వేధింపులకు దూరంగా, ఆత్మగౌరవంతో జీవించే సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి బి. నికిత, న్యాయవాది షేర్ నరేందర్, సారంగాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ బ్యాగరి గంగవ్వ, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.