బాసరలో తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
- బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రంలో తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, I ఐపీఎస్ మంగళవారం ప్రారంభించారు
ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఆలయ అభివృద్ధి, విస్తరణ మాస్టర్ ప్లాన్ పనుల్లో భాగంగా పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని తొలగించిన నేపథ్యంలో, భక్తులకు, స్థానిక ప్రజలకు నిరంతర పోలీస్ సేవలు అందించేందుకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేసే బాసర క్షేత్రంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ, పోలీస్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.ప్రారంభోత్సవం అనంతరం తాత్కాలిక పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డు గది, రిసెప్షన్ కౌంటర్ తదితర వసతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.బాసర క్షేత్రానికి వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని సూచించారు. పండుగలు, విశేష పర్వదినాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్‌హెచ్‌ఓ దీపక్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
