ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
- విద్యార్థుల ప్రతిభను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా ముధోల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ,నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
మంగళవారం ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించి, శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ భవనం స్థానంలో నూతన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యతో పాటు విద్యా బోధనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఐదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా ముచ్చటించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని, స్నేహితులు ఎవరైనా బడికి రాకపోతే వారిని కూడా పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు గణితంలో సులభంగా లెక్కలు చేయగలిగే మెలకువలను వివరించి,వారితో పలు లెక్కలు చేయించారు.ఇంగ్లీష్ పదాలను వ్యతిరేక క్రమంలో చదివించి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు.
విద్యార్థులు చూపిన ప్రతిభకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.పలువురు విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా అందించి ప్రోత్సహించారు. ఉపాధ్యాయుల బోధనా విధానం, విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.ఈ తనిఖీలో జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవకుమార్, డీఎల్పీవో లక్ష్మణ్, సర్పంచ్ షబానా బేగం,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
