📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
Sports

అట్టహాసంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల కుస్తీ పోటీలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
అట్టహాసంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల కుస్తీ పోటీలు
  • సొంత నిధులతో పోటీల నిర్వహణకు సహకరించిన ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్‌చెరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల కుస్తీ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పోటీల నిర్వహణకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో సహకరించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని అన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు పటాన్‌చెరు మైత్రి మైదానం వేదికగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను విద్యార్థుల దినచర్యలో భాగం చేసినప్పుడే ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎట్టయ్య, పృథ్వీరాజ్, రాజ్ కుమార్, రాము, షకీల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.