పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తో కలిసి మండల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరుతడి పంటల సాగుపై రైతులకు వివరించాలని, నవంబర్ 30వ తేదీ వరకు జిల్లాలోని రైతు వేదికలలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. మండలాల వారీగా పంటల వైవిధ్యీకరణ ప్రణాళికలను రూపొందించి, గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహిస్తూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు విత్తనాల విక్రయాలపై పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర, వరి సన్న ధాన్యం కొనుగోళ్లు, పత్తి పంట కోతలు, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంతో పాటు కూరగాయల విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కడెం ప్రాజెక్టు నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని, యాసంగిలో విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గుల కారణంగా పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఆరుతడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు సాగు విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా తక్కువ నీటితో విజయవంతంగా పంటలు సాగు చేస్తున్న రైతులను గుర్తించి, వారు అనుసరిస్తున్న పద్ధతులను ఇతర రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. విజయవంతమైన సాగు విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా జిల్లాలో నీటి పొదుపు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
