టీజీఎస్పీఎఫ్ సేవలు అజరామరం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భద్రతలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కీలక పాత్ర
- ప్రజల్లో భయాన్ని కాదు.. భరోసాను కల్పించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌లోని టీజీఎస్పీఎఫ్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన 36వ రైజింగ్ డే పరేడ్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీజీ స్వాతి లక్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా 36వ బ్యాచ్ టీజీఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి ఉప ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించి, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
67 ప్రభుత్వ సంస్థలకు భద్రత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 67 సంస్థల్లో రెండు వేల మందికి పైగా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా సేవలు అందిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. గత 35 ఏళ్లలో భద్రతా రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.
ప్రజలకు భరోసా కల్పించాలి
టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ప్రజలతో మమేకమై పనిచేయాలని, ప్రజల్లో భయాన్ని కలిగించడం కాకుండా భరోసా నింపాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. దేశానికి, రాష్ట్రానికి భద్రత కల్పిస్తున్న సిబ్బంది వెనుక వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మనోధైర్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల సేవలను కూడా గుర్తించాలని అన్నారు.
ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఆలోచనాత్మక విధానాలను అవలంబిస్తూ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. దేశం, రాష్ట్రం గర్వపడేలా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది తమ సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న సిబ్బంది పాల్గొన్నారు.
