📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS సైబర్ నేరాలు, గంజాయి నివారణపై విద్యార్థులకు అవగాహన
‹
›
District News

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు.
  • బాసర ట్రిపుల్ ఐటీలో రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం. విద్యార్థులకు నీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు.. రెండు మోటార్ల మరమ్మతులకు రూ.8 లక్షలు కేటాయింపు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడి
నిర్మల్, అక్టోబర్ 26 (సాక్షర ప్రతినిధి):బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సోమవారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్.. గోదావరి నది వద్ద ఉన్న నీటి సరఫరా ఇంటెక్ వెల్, మోటార్లు, ఐఐఐటీ ప్రాంగణంలోని నీటి నిల్వ కుంట, పంపుహౌస్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు.
రోజుకు 15 లక్షల లీటర్ల నీటి అవసరం
ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 10 వేల మంది వరకు ఉంటారని, వారి తాగునీరు, ఇతర రోజువారీ అవసరాలకు రోజుకు సుమారు 15 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని కలెక్టర్ వివరించారు. గోదావరి నది వద్ద ఐఐఐటీకి నీటిని సరఫరా చేసేందుకు 60 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటార్లు ఉండగా, ప్రస్తుతం ఒకటి మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.పనిచేయని రెండు మోటార్ల మరమ్మతుల కోసం రూ.8 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందం ఇంటెక్ వెల్‌ను పరిశీలించిందని, పది రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి మోటార్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న మోటారు రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉందని వివరించారు.
ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి
భవిష్యత్తులో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో కొత్త మోటారును ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైతే గ్రామపంచాయతీ ఇంటెక్ వెల్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో పాటు, గ్రామపంచాయతీ ట్యాంకర్లను కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు.ఐఐఐటీ ప్రాంగణంలో సుమారు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నీటి నిల్వ కుంటను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం నీటి లభ్యతలో ఇబ్బంది లేదని, ప్రధానంగా సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందని స్పష్టం చేశారు.
భౌతిక తరగతుల ప్రారంభానికి చర్యలు
విద్యార్థులకు రోజువారీ నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం నీటి సరఫరా మోటార్లకు అవసరమైన పరికరాలను వెంటనే తెప్పించి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, గ్రిడ్ డీఈఈ, ఈఈలు రాజేశ్వర్ రావు, రాఘవేంద్ర రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఐఐఐటీ డీన్లు మహేష్, విఠల్, విద్యార్థి సంక్షేమ అధికారి నాగరాజు, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.