- బీసీ-ఏ కులాల హక్కులకు భంగం కలగకుండా చూడాలి – జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
నిర్మల్, అక్టోబర్ 26 (సాక్షర ప్రతినిధి):బీసీ-ఏ వర్గంలో ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనలను పునఃపరిశీలించి, ప్రస్తుతం ఆ వర్గంలో ఉన్న కులాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. బీసీ-డీ జాబితాలో ఉన్న ముదిరాజ్ కులస్థులను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బహుజన యోధుడు పండుగ సాయన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రస్తావించిన నేపథ్యంలో, ఈ ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఏఓ ప్రవీణ్‌కు సమితి నాయకులు వినతి పత్రం సమర్పించారు. బీసీ-ఏ వర్గంలో ఇప్పటికే ఉన్న కులాల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఇతర కులాలను ఆ వర్గంలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.ఈ సందర్భంగా బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశెట్టి, నిర్మల్ జిల్లా కన్వీనర్ తోకల సరస్వతి, భైంసా డివిజన్ కన్వీనర్ హన్మాన్వారి ప్రమీల, జిల్లా నాయకులు తోకల పోశెట్టి, పడిగెల దేవేందర్, యు. శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ-ఏ కులాల సమస్యలు పరిష్కరించాలి
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బీసీ-ఏ వర్గంలో ఇతర కులాలను చేర్చే అంశంపై నిర్ణయం తీసుకునే ముందు, ప్రస్తుతం ఆ వర్గంలో ఉన్న కులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు, ప్రయోజనాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ఇతర కులాలను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని ముందుకు తీసుకెళ్తే, భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రస్తుత బీసీ-ఏ వర్గంలోని కులాల హక్కులను పరిరక్షిస్తూ, అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer