దివ్యాంగ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి
- నిర్మల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహణ – సమాన అవకాశాలతో విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్మల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఈ పోటీలను నిర్వహించారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం, వారి శారీరక దృఢత్వాన్ని అభివృద్ధి చేయడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను, పట్టుదలను, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందారు. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమ్మిళిత విద్య ప్రాధాన్యతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
విభిన్న సామర్థ్యాలు.. ఒకే కలలు
“విభిన్న సామర్థ్యాలు.. ఒకే కలలు” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి, వారిని మరింత ముందుకు నడిపించాలనే లక్ష్యంతో సాగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లోనూ తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా సమగ్ర శిక్ష ఎఫ్ఏఓ శ్రీమతి సిద్ధ పద్మ, జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, సమ్మిళిత విద్యా వనరుల వ్యక్తులు (IERPs), నిర్వాహకులు, సహాయక సిబ్బందిని జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు
