- మాధాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పోలీసుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం
నిర్మల్ అక్టోబర్ 26 (సాక్షర ప్రతినిధి):విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేయడానికి సోన్ మండల పరిధిలోని మాధాపూర్ గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు.సైబర్ నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర, గంజాయి, మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల బాధ్యత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలనే అంశాలపై ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత కల్పించడం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ వివరాలను ఇతరులతో పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.అదేవిధంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా చదువుపై దృష్టి సారించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది ఎం. రవి, ఎం. భాస్కర్, ఎన్. వెంకటరమణ, ఎ. కీర్తన తదితరులు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer