ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు
- ఔషధాల భద్రత, సరఫరా నిర్వహణపై అధికారులకు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాల నిల్వ, సరఫరా నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన మందులను సురక్షితంగా నిల్వ చేసేందుకు తగిన వసతులు కల్పించాలని సూచించారు.
ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వైద్య కళాశాల అనాటమీ విభాగంలో నిల్వ ఉంచిన ఔషధాలను అవసరాలకు అనుగుణంగా టీవీవీపీ భవనానికి తరలించాలని అధికారులకు సూచించారు.
ఔషధాల అవసరం, ప్రాధాన్యతను బట్టి వాటిని క్రమపద్ధతిలో నిల్వ చేయాలని, మందుల సరఫరా, నిల్వల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఔషధాలు పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచాలని స్పష్టం చేశారు. అలాగే నిల్వ కేంద్రానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పరిశీలనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, అధికారులు సౌమ్య, వంశీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
