ఆచరణాత్మక బోధనతోనే విద్యార్థుల సమగ్ర వికాసం
- కల్లూరు కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, నిత్యజీవిత అనుభవాలతో అనుసంధానం చేసుకొని నేర్చుకునేలా ఉపాధ్యాయులు ఆచరణాత్మక బోధన అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ఆలోచనా శక్తి, తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అనుభవపూర్వక విద్య ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.మంగళవారం కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహం, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు
వసతి గృహ ప్రాంగణంలో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం అన్ని పూటలా నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం వందకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.4.80 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ నిర్మాణంతో పాటు అవసరమైన ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోతుల బెడద నివారణకు సోలార్ కంచె ఏర్పాటు చేస్తామని, తరగతి గదుల్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో బెంచీలు సమకూరుస్తామని వెల్లడించారు.
విద్యార్థులతో ముఖాముఖి.. స్వయంగా పాఠ్య బోధన
అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతిపై వివరాలు తెలుసుకున్నారు. జీవశాస్త్రంలోని ఒక అంశాన్ని స్వయంగా బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి, పాఠ్యాంశాలపై వారి అవగాహనను పరిశీలించారు.పాఠ్యాంశాలను నిత్యజీవితంలోని అంశాలతో అనుసంధానం చేసుకొని చదివితే విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుందని విద్యార్థులకు సూచించారు. ఇందులో భాగంగా వివిధ రకాల కూరగాయలను తెప్పించి వాటి బరువును ముందుగా అంచనా వేయించారు. అనంతరం తూనిక యంత్రంతో బరువును కొలిపించి, సరైన అంచనా వేసిన విద్యార్థులను అభినందించారు. వారికి పెన్నులను బహుమతులుగా అందజేశారు. నిత్యజీవితంలోని చిన్న చిన్న అంశాల నుంచి కూడా విజ్ఞానాన్ని పొందాలని సూచించారు.ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనంభోజన్న, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీఓ శోభన, ఎంఈఓ ముత్యం, సర్పంచ్ దశరథ్, సర్వే అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
