📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
State News

భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఈ నెలాఖరులోగా తొలి విడత రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలి
  • అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టీకరణ*
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర, నవంబర్ 11 : రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తప్పిదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, నాణ్యతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అంశాలపై సమీక్షలు నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రౌండ్ రిపోర్టులను సేకరిస్తున్నామని, రీసర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు.
క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు, సవరణలు చేపట్టాలని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి మండలంలో రీసర్వే కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసి సకాలంలో రీసర్వే పక్కాగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.
రీసర్వే జరిగే సమయంలో సంబంధిత గ్రామాల రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, స్థానిక రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. సర్వే నివేదికల పై అభ్యంతరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, ఏ విధంగా పరిష్కరించబడతాయి అనే అంశాలపై ప్రజలకు ముందుగానే డప్పు చాటింపు తదితర పద్ధతుల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు.
ప్రజలకు రీసర్వే వివరాలు పూర్తిస్థాయిలో తెలియజేయాలని, వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రికార్డులు కచ్చితత్వంతో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అసలైనవా, నకిలీవా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. పట్టా పొందిన వ్యక్తులే ప్రస్తుతం ఆ భూములపై ఆధీనంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని అన్నారు. గతంలో ఒకరికి పట్టా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మరొకరు భూమిని అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుత అనుభవదారుడు అర్హుడా కాదా అనే అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. పట్టాలో పేర్కొన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని తెలిపారు. సాగునీటి చెరువులు, రహదారులు, కుంటలు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో భూసేకరణ చేసిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రీసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా, రీసర్వే ప్రక్రియను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో తొలి విడతగా నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రీసర్వే ను మరింత వేగవంతంగా జరిపించేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్లను ఎక్కువ సంఖ్యలో సమకూర్చుకునేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, ఆర్డీఓ లు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.