- కేసరి ఆంజనేయులు గౌడ్,ఇంపాక్ట్ క్లబ్ ఏరియా ఇంచార్జ్ కొమరం భీం జిల్లా.
రెబ్బెన,సాక్షర:జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్20 ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాల,గోలేటి ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక వ్యక్తిత్వ వికాసం,కెరీర్ గైడెన్స్,విద్యా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 20కొమరం భీం జిల్లా ఏరియా ఇన్చార్జి కేసరి ఆంజనేయులు గౌడ్ విద్యార్థులతో నేరుగా మమేకమై వారితో ఆసక్తికరంగా సంభాషిస్తూ వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం,సానుకూల ఆలోచనా విధానం,లక్ష్య నిర్దేశం,నాయకత్వ లక్షణాలు,కమ్యూనికేషన్ నైపుణ్యాలు,క్రమశిక్షణ, సమయపాలన,సామాజిక బాధ్యత వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు,ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు,శాస్త్రవేత్తలు,వ్యాపారవేత్తలు వంటి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏయే సబ్జెక్టులను ఎంచుకోవాలి,ఎలాంటి కోర్సులు అభ్యసించాలి ఏయే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అనే అంశాలపై సమగ్ర కెరీర్ మార్గదర్శకత్వం అందించారు.విద్యార్థులు అభిరుచి,ఆసక్తి,ప్రతిభను గుర్తించి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు,చెడు అలవాట్లు,హింసాత్మక ప్రవర్తన,తోటి విద్యార్థుల పట్ల వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.కోపాన్ని నియంత్రించుకోవడం, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,తోటి విద్యార్థులను గౌరవించడం,మానవత్వం,మంచి నడవడికను అలవర్చుకోవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని దానిని గుర్తించి సరైన దిశలో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కనాలని,వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడాలని సూచించారు. జీవితంలో విజయం సాధించాలంటే విద్యతోపాటు క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం,పట్టుదల,సంస్కారం ఎంతో అవసరమన్నారు.అనంతరం ఇంపాక్ట్ సభ్యులు ఆర్సీ సర్వీస్ వేముల రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి బహుమతులుగా పెన్నులను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి,సృజనాత్మక ఆలోచనా విధానం,పోటీతత్వాన్ని పెంపొందించడమే ఈ ప్రోత్సాహ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో సింగరేణి ఉన్నత పాఠశాల హెచ్ఎం రవితేజ,పిఈటి భాస్కర్,గోలేటి ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.దేవయ్య,ఇంపాక్ట్ సభ్యులు,రిటైర్డ్ ఎంఈఓ రాజేశం గౌడ్,దాసరి శ్రీనివాస్,అజ్మీర ప్రభాకర్,నరేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER