భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలి రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతం చేసి, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రాజస్వ మండల అధికారులు, సర్వే & ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత శాఖల అధికారులతో భూ రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సాంకేతిక అంశాలు, రైతుల స్పందన, సర్వే సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి వారి భూమిపై స్పష్టమైన హక్కులు, ఖచ్చితమైన సరిహద్దులు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, మొదటి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో ఒక్కో జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2 వేల 720 గ్రామాలలో రీసర్వే చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 వేయి గ్రామాలలో సర్వే పనులు ప్రారంభం కాగా, 416 గ్రామాలలో సర్వే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన గ్రామాలలో పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని సూచించారు.భూ రీసర్వే చేపట్టే సమయంలో పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, సెత్వార్, టిప్పన్, ఎఫ్.ఎం.బి., గ్రామ నక్షాలు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, సబ్ డివిజన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, రికార్డులలో ఉన్న వివరాలను క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులతో సరిపోల్చుకుంటూ సర్వే నిర్వహించాలని తెలిపారు. భూముల సరిహద్దులు, సర్వే నంబర్ల విభజనలు, విస్తీర్ణంలో ఉన్న వ్యత్యాసాలను గుర్తించి సంబంధిత ఆధారాలతో పరిశీలించాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. భూ రీసర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రోవర్లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, క్యూ జి ఐ ఎస్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన భూముల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి భద్రపరచాలని, భూముల విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్లు తదితర వివరాలను సాంకేతిక వ్యవస్థలలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. రీసర్వే ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశంగా భూ యజమానులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, వారి భూముల విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్లు, ఇతర వివరాలను పరిశీలించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. నోటీసులు సంబంధిత భూ యజమానులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, నోటీసుల జారీకి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించారు. భూ యజమానులకు తమ భూముల వివరాలపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించుకునే అవకాశం కల్పించాలన్నారు. రీసర్వేలో గుర్తించిన భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలపై రైతులు, భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను నిర్లక్ష్యం చేయకుండా రిజిస్టర్లో నమోదు చేయాలని, ప్రతి అభ్యంతరానికి సంబంధించిన వివరాలు, దరఖాస్తుదారుల వివరాలు, సంబంధిత సర్వే నంబర్లు, సమర్పించిన ఆధారాలు నమోదు చేసి, సంబంధిత అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని తెలిపారు. అవసరమైన సందర్భాలలో పాత రెవెన్యూ రికార్డులు, సర్వే నక్షాలు, ఇతర భూ పత్రాలను పరిశీలించి, సంబంధిత భూ యజమానుల వాదనలు విన్న అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సర్వే ఫలితాలతో ఏకీభవించని భూ యజమానులకు వర్తించే నిబంధనల ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశాన్ని తెలియజేయాలని తెలిపారు. అప్పీళ్లను సంబంధిత సమర్థ అధికారుల పరిధిలో స్వీకరించి, విచారణ నిర్వహించి, తగిన ఆధారాల ఆధారంగా పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభ్యంతరాలు, అప్పీళ్లను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ రీసర్వే కార్యక్రమంపై రైతులు, భూ యజమానులు, గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, రీసర్వే చేపట్టేందుకు గల కారణం, సర్వే విధానం, భూముల హద్దుల గుర్తింపు, నోటీసుల జారీ, అభ్యంతరాల సమర్పణ, ఆపిల్ విధానం అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ సభలు, రైతు సమావేశాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు, మైక్ ప్రకటనలు, ఇతర సమాచార మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరాలు తెలియజేయాలని సూచించారు. రీసర్వే వల్ల కలిగే ప్రయోజనాలు, భూముల సరిహద్దుల నిర్ధారణ, భవిష్యత్తులో భూ వివాదాల నివారణ, డిజిటల్ భూ రికార్డుల ప్రాధాన్యతపై రైతులకు వివరించాలని తెలిపారు. ప్రజలలో ఉన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేసి, ప్రతి భూ యజమాని ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా భూదార్ నంబర్ కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని, భూముల హద్దులు, విస్తీర్ణం, సంబంధిత రికార్డుల వివరాలను సమగ్రంగా నమోదు చేసి భూ భారతి పోర్టల్‌తో అనుసంధానం చేయాలని తెలిపారు. భూములకు సంబంధించిన వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో భూముల కొనుగోలు, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సమయంలో భూ యజమానులకు ఎదురయ్యే సమస్యలను తగ్గించేలా రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రీసర్వే గ్రామాల వారీగా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), రాజస్వ మండల అధికారులు, సబ్ కలెక్టర్లు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సర్వే ప్రారంభం, పూర్తయిన పనులు, నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సర్వే సిబ్బందికి అవసరమైన సాంకేతిక పరికరాలు, శిక్షణ, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. భూ రీసర్వే అనేది కేవలం భూముల కొలతలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా ప్రతి భూ యజమానికి భద్రమైన హక్కులు కల్పించే కీలక కార్యక్రమమని, అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, సమన్వయంతో పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాల విషయంలో ఎవరూ అనవసరంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించడం, స్థలాల వద్ద సమస్యలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడకుండా పర్యవేక్షించాలని తెలిపారు. భూ రీసర్వే నిర్వహించే సమయంలో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన వివరాలను సంబంధిత రికార్డులతో పరిశీలించాలని, ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు తలెత్తితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి కేటాయించిన స్థలాలలో ఇళ్ల నిర్మాణ పనులు సజావుగా కొనసాగేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడటం అధికారుల బాధ్యత అని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో రీ సర్వే ప్రక్రియ నిమిత్తం అవసరమైన రోవర్లను అధికారులకు అందించి ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
