బాసర ట్రిపుల్ ఐటీపై దుష్ప్రచారం తగదు.
- విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. నిరంతర పర్యవేక్షణలో వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను విశ్వవిద్యాలయ యాజమాన్యం ఖండించింది. ఇటీవల 'ఆంధ్రజ్యోతి 'దినపత్రికలో ప్రచురితమైన కలెక్టర్ పర్యటన సందర్భంగా అధికారులు ముఖం చాటేశారు"అనే కథనంపై స్పందిస్తూ, అందులో పేర్కొన్న అంశాలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని యాజమాన్యం స్పష్టం చేసింది. నిజానిజాలను తెలుసుకోకుండా ఇటువంటి కథనాలు ప్రచురించడం వల్ల విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు, అధికారుల మనోధైర్యానికి భంగం కలుగుతుందని పేర్కొంది.
కలెక్టర్ పర్యటనపై యాజమాన్యం వివరణ.........
అక్టోబర్ 25 న రాత్రి కలెక్టర్ కార్యాలయం నుంచి పర్యటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్పందించినట్లు యాజమాన్యం తెలిపింది. 26 న హైదరాబాద్‌లో ముందుగా నిర్ణయించిన అధికారిక సమావేశం ఉండటంతో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ క్యాంపస్‌లో అందుబాటులో ఉండలేని విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ముందుగానే వివరించినట్లు వెల్లడించింది.
కలెక్టర్ పర్యటన గురించి తెలిసిన వెంటనే వీసీ స్వయంగా జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారని, స్థానిక అధికారులను అప్రమత్తం చేసి పర్యటనకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారని తెలిపింది. పర్యటన పూర్తయ్యే వరకు ఫోన్ ద్వారా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను పర్యవేక్షించినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించకుండా వార్తలు ప్రచురించడం సరికాదని యాజమాన్యం అభిప్రాయపడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాధారమైన ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
మరోవైపు, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
విద్యార్థుల సమస్యలు కార్యాలయ వేళలకే పరిమితం కాకుండా, అవసరమైన సందర్భాల్లో తక్షణ స్పందన ఉండేలా వీసీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొంది. క్యాంపస్‌లో విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, వారి విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా చూడడం యాజమాన్యం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకూడదు.........
గతంలో పలు సమస్యలను ఎదుర్కొన్న బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని యాజమాన్యం అభిప్రాయపడింది. ప్రభుత్వ శాఖలు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్న సమయంలో వివాదాస్పద ప్రచారాల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసర ఆందోళనలు నెలకొనకూడదని పేర్కొంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ తమ భవిష్యత్తును నిర్మించుకునే ఈ విద్యాసంస్థలో విద్యా వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపింది. విద్యార్థులను వివాదాల్లోకి లాగకుండా, వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించింది.
విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరించాలి...........
బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, క్యాంపస్‌లో ప్రశాంతమైన విద్యా వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యమని యాజమాన్యం స్పష్టం చేసింది. నిరాధారమైన ప్రచారాలకు బదులుగా వాస్తవాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయ అభివృద్ధికి అధికారులు, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని ఆర్జీయూకేటీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
