విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి
- స్పోర్ట్స్ అరీనాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి – అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలు
జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను స్పోర్ట్స్ అరీనాలో అందుబాటులో ఉంచాలని, అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో జంతువుల స్టెరిలైజేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
గురువారం నిర్మల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు, పారిశుద్ధ్య కేంద్రాలు, భూ సర్వే పనులను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి.........
సోఫీనగర్‌లోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల వసతిగృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు మెరుగైన భద్రత, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ పరీక్షల సమయానికి సిలబస్ పూర్తిచేయడంతోపాటు విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధ్యాపకులకు సూచించారు.
ఎంఈసీ విభాగం విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, భోజనం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలు చేయించి, ప్రతిభ కనబరిచిన వారిని అభినందించి పెన్నులను బహుమతిగా అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్పోర్ట్స్ అరీనాలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
దివ్యనగర్‌లోని స్పోర్ట్స్ అరీనాను పరిశీలించిన కలెక్టర్........ క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, క్రీడలు ఆడేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. షటిల్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ కోర్టుల పరిసరాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.
అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మహాలక్ష్మీవాడ సమీపంలోని అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ జంతువుల స్టెరిలైజేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఖానాపూర్, భైంసా ప్రాంతాల్లోనూ అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.
డంప్ యార్డును పరిశీలించిన కలెక్టర్........... తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు స్పష్టం చేశారు.
భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి.........
గండిరామన్న నుంచి కమలానగర్ వరకు చేపడుతున్న అటవీ, రెవెన్యూ భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి అటవీ, రెవెన్యూ భూముల హద్దులను స్పష్టంగా గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ పర్యటనలో డీవీహెచ్ఓ సురేష్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు రాజు, ప్రభాకర్, మున్సిపల్ డీఈ హరిభువన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
