📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS రేపు విద్యుత్ అంతరాయం
‹
›
District News

జర్నలిస్టులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
జర్నలిస్టులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలి 
                                                                                  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర
ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరవేసే పాత్రికేయులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా ఆత్మీయ మహాసభకు డి.సి.పి. ఎ.భాస్కర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహాత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, ఐ.జె.యు. రాష్ట్ర కార్యవర్గసభ్యులు రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, ఎనగందుల రవీందర్, కేశెట్టి వంశీకృష్ణ, కాచం సతీష్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వార్తల ప్రచురణలో నిష్పాక్షికత, నిజానిజాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. యూనియన్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఆ సంఘంలోని సభ్యుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ఆపద సమయాలలో అండగా నిలవడం, అవసరమైన సందర్భాలలో బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు కల్పించడం ఉంటుందని తెలిపారు. యూనియన్ సభ్యుల సంక్షేమంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలు, విలువలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జర్నలిజం రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, గతంలో ఒక జిల్లాలో పరిమిత సంఖ్యలో మాత్రమే జర్నలిస్టులు ఉండేవారని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతతో జర్నలిస్టుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. సమాజంలో జరిగే మంచి, చెడు, అన్యాయం, న్యాయం వంటి ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాల పనితీరు, వాటిలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఒకే అంశంపై భిన్నమైన, కొన్నిసార్లు తప్పుడు సమాచారాలు కూడా విస్తృతంగా ప్రచారమవుతున్నాయని, ప్రజలు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. వివాదాస్పద అంశాలపై వార్తలు ప్రచురించే సమయంలో సంబంధిత అధికారుల అధికారిక వివరణను కూడా తీసుకోవాలని, తద్వారా రెండు వైపుల వాదనలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. పరిపాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థతో పాటు మీడియా కూడా విమర్శలకు అతీతం కాదని, ప్రతి వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని తెలిపారు. వృత్తిపరమైన నైతిక విలువలు, బాధ్యతాయుతమైన వార్తా సేకరణ, నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జర్నలిజం రంగంపై ప్రజలలో మరింత విశ్వసనీయత పెరుగుతుందని తెలిపారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
డి.సి.పి.మాట్లాడుతూ సమాజంపై అవగాహన, సామాజిక స్పృహ, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్నవారే పాత్రికేయ వృత్తిని ఎంచుకుంటారని, సమాజంలో చైతన్యం తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పాత్రికేయ వృత్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి, వార్తా సేకరణతో పాటు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంపై అభిరుచి ఉన్నవారే ఈ రంగంలో కొనసాగగలరని తెలిపారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సమాజానికి సేవ చేయాలనే తపనతో ఈ వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. చిన్న, పెద్ద పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సరైన వేతనాలు లేకపోవడం, లభించే అరకొర వేతనాలు కూడా కుటుంబ పోషణకు సరిపోని పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. ఏదైనా ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ముందుగా అక్కడికి చేరుకోవాలనే తపన పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులలోనూ ఉంటుందని, పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా సంఘటనా స్థలానికి చేరుకుంటే, పాత్రికేయులు ప్రజలకు సమాచారం అందించాలనే బాధ్యతతో వేగంగా అక్కడికి చేరుకుంటారని వివరించారు. కెమెరా / సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినీ పాత్రికేయులుగా పరిగణించలేమని, బాధ్యతాయుతంగా వార్తలను సేకరించి, వాస్తవాలను పరిశీలించి, సమాజానికి సరైన సమాచారాన్ని అందించే వారే నిజమైన పాత్రికేయులని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలలో పాత్రికేయులు వారధిగా నిలిచి సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడ్డారని తెలిపారు. వార్తా సేకరణ కోసం, కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పాత్రికేయులు వేగంగా ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల కారణంగా కొందరు మీడియా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబం పట్ల కూడా వ్యక్తిగత బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలని సూచించారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మహాసభలు కేవలం ఎన్నికల ప్రక్రియకు మాత్రమే పరిమితం కాకుండా, గత మహాసభ నుంచి ఇప్పటివరకు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా చర్చించుకునే వేదికలుగా ఉండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి 75 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి నైతిక విలువల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ విలేకరులకు పత్రికా యాజమాన్యాలు ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వకుండా, ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయించేవని, కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా నిరాకరించిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. అలాంటి సమయంలో గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు గుర్తింపు, అక్రిడిటేషన్ కార్డులు కల్పించేందుకు సంఘం నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టులకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య భద్రతకు కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యు.జె. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు, వివిధ మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు.