📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రబీ సీజన్ ప్రణాళిక, విద్య, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
‹
›
District News

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
                                                            రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మంచిర్యాల సాక్షర
భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో పథకం అమలు, కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన కుటుంబ పెద్దకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కుటుంబ పెద్దకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలలో ఒకేసారి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ పథకం అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాలలో అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేసి, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి, దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సక్రమంగా సేకరించాలని ఆదేశించారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, కుటుంబ సభ్యుల వివరాల సేకరణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే సంబంధిత కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలని తెలిపారు.
పథకం విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియ, అమలు తీరు గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు జిల్లాలో అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా ప్రణాళిక అధికారి పాపయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.