📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
‹
›
District News

రైతులకు సూక్ష్మ సేద్యంపై అవగాహన కల్పించాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రైతులకు సూక్ష్మ సేద్యంపై అవగాహన కల్పించాలి
  • పంట మార్పిడి, ఉద్యాన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలి.. ప్రభుత్వ రాయితీలు రైతులకు అందేలా చూడాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్, నవంబర్ 13 (సాక్షి ప్రతినిధి):
జిల్లాలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సూక్ష్మ సేద్య పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, విబి-జీ రామ్ జీ, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహించాలని, తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సూక్ష్మ సేద్య పద్ధతులపై అవగాహన కల్పించి, ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయడంతో పాటు రైతుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందేలా చూడాలన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. సమగ్ర శిక్షా అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విబి-జీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని సూచించారు.వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ....... జిల్లాలో ఉద్యానవన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని, సూక్ష్మ సేద్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రభుత్వ రాయితీలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.అలాగే సమగ్ర శిక్షా అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, నీటి సంరక్షణ పనులను చేపట్టి భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, సీపీఓ గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్ సందీప్, నీటిపారుదల శాఖ అధికారులు రాజేంద్రప్రసాద్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.