📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కు తరలి రావాలని పిలుపు
‹
›
District News

సమీకృత సేంద్రియ సాగు విధానం భేష్ - జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత్రంను సందర్శించిన కలెక్టర్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
సమీకృత సేంద్రియ సాగు విధానం భేష్ - జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత్రంను సందర్శించిన కలెక్టర్
  • ఆదర్శ రైతు నవీన్ కుమార్ కృషిని అభినందించిన జిల్లా పాలనాధికారి*
  • ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు హితవు
  • నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపు
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 30 : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, సేంద్రియ వ్యవసాయం, సమీకృత పంటల సాగు విధానాలను అవలంభించడం ద్వారా నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు రైతులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హితవు పలికారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆర్మీ మాజీ ఉద్యోగి సీహెచ్.నవీన్ కుమార్ 'జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్' పేరిట నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సమీకృత పంటల సాగు విధానాలను స్వయంగా పరిశీలించి, ఆదర్శ రైతు నవీన్ కుమార్ చేస్తున్న వినూత్న ప్రయోగాలను, కృషిని అభినందించారు.
క్షేత్రంలో ఆకు కూరలు, వివిధ రకాల కూరగాయలు, పూల తోటలు, పండ్ల మొక్కలు, గానుగ, ఆయిల్‌పామ్, అరటి, కొబ్బరి సాగుతో పాటు చేపల పెంపకం, నాటుకోళ్ల పెంపకం వంటి విభిన్న వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలతో వివిధ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి, ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయాలు చేపడుతున్న విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం చేపడుతూ, వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్న విధానం, భూగర్భ జలాల పెంపు కోసం వర్షపు నీటి సంరక్షణకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిని గమనించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్మీలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి, ఆధునిక సాంకేతికతను సేంద్రియ వ్యవసాయంతో సమన్వయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నవీన్ కుమార్‌ను ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై శెనగ, మినుములు వంటి పప్పు దినుసు పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రాయితీపై అందిస్తున్నామని అన్నారు.
అనంతరం ఆదర్శ రైతు నవీన్ కుమార్ తన వ్యవసాయ అనుభవాలను, సేంద్రియ సమీకృత వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను కలెక్టర్‌కు వివరించారు. నవీన్ కుమార్ మాతృమూర్తి పుష్ప సైతం సేంద్రీయ సాగులో భాగస్వామ్యం అవుతూ ఎంతో అవగాహన కలిగి ఉండడం పట్ల కలెక్టర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరహా వ్యవసాయ పద్ధతులపై ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించేందుకు వారిని ఇక్కడికి క్షేత్ర సందర్శనకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. నవీన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు వారి అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ, ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంపై తోటి అన్నదాతల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. తక్కువ నీటి వినియోగం, సేంద్రియ సాగు, సమీకృత వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణపై రైతులకు ఆదర్శంగా నిలిచేలా జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత్రం ఉందని, జిల్లాలో ఇప్పటివరకు తాను జరిపిన క్షేత్ర సందర్శనలో ఇది తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ దత్తాద్రి, రైతులు పాల్గొన్నారు .