20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
- 18వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. పోస్ట్‌కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి ఉద్యోగుల విజ్ఞప్తి........
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు పోస్ట్‌కార్డుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్యలను తెలియజేస్తూ వినతులు పంపించారు.గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు.
అలాగే మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి సంవత్సరం 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ కల్పించాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ అధ్యక్షుడు గంగాధర్, కోఆర్డినేటర్ రమణ, నాయకులు డాక్టర్ రమేష్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సన్నిత్, డాక్టర్ రాణా ప్రతాప్, వంశీ, వినీత, సుజాత, రాధ, ముత్యం, జైపాల్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
