ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసుపత్రులలో సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలోని ప్రభుత్వవిద్యాసంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను టెండర్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పనులను త్వరితగతిన పూర్తిచేసి జూనియర్ కళాశాలకు భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా గణిత పాఠ్యాంశాలను బోధించి, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, రిజిస్టర్లు, పడకలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకోవడానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించి గర్భిణులు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, రెవెన్యూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తహసిల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వివరాలు అడిగి నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం జన్నారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూ అమలును పరిశీలించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులను పరిశీలించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నందున మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న భోజనశాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, రోగులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రి నిర్వహణను పరిశీలించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాల వివరాలను సేకరించి, సంబంధిత ప్రాంతాలలో నీటి నమూనాలను పరీక్షించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారానికొకసారి / కనీసం నెలకు ఒకసారి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ జి. బక్కయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్ లతో కలిసి భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ రెవెన్యూ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, వివిధ దశలలో ఉన్న ఇండ్ల వివరాలు, పారిశుధ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలోఇండ్లునిర్మించుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
