📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS యశోద హాస్పిటల్స్ అత్యాధునిక యూరాలజీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవలతో నిజామాబాద్ వాసులకు మెరుగైన ఆధునిక చికిత్స
‹
›
District News

16వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
16వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.
  • ప్రభుత్వం స్పందించేదెప్పుడు? న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
నిర్మల్ అక్టోబర్ 28 (సాక్షర ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 13, 2026న ప్రారంభమైన ఈ సమ్మెలో బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంలు పాల్గొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మెలో భాగంగా బుధవారం ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని అన్ని కేడర్ల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి కేడర్‌కు తగిన విధంగా వేతనాలను నిర్ణయించి, 100 శాతం స్థూల వేతనం అందించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
2018 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన పురోగతికి సంబంధించి సంవత్సరానికి 5 శాతం ఇంక్రిమెంట్లు అమలు చేయడంతో పాటు, 8 శాతం లాయల్టీ బోనస్ మంజూరు చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), టర్మ్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలని, కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అలాగే, తెలంగాణ రాష్ట్ర పరిధిలో పారదర్శక బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టాలని, అర్హులైన మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించకూడదని స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులను రాష్ట్ర ఆరోగ్య సంఘం పరిధిలోనే కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జిల్లా జేఏసీ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కోఆర్డినేటర్ రమణ, జేఏసీ నాయకులు డాక్టర్ రమేష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ నాగరాజు, యోత్సేనా, వినీత, సుజాత మాట్లాడుతూ.. ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమ్మె విరమణకు చొరవ తీసుకోవాలని వారు కోరారు.