📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS పి.ఎం. శ్రీ పాఠశాలలలో ప్రతిభకు వేదికగా జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం
‹
›
District News

రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి

◉ G Radhakrishna Goud   |   ◷ Latest
రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి
  • KB Asf
రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

అక్టోబర్ 28, 2026:
వి.బి.జి. రామ్ జీ పథకం క్రింద రైతులు పశువులకు అవసరమైన పచ్చి గడ్డి సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సిఈఓ డి.దివ్య దేవరాజన్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వి.బి.జి. రామ్ జీ పథకం అమలు, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో రైతులు, గ్రామీణ కూలీలకు వి.బి.జి. రామ్ జీ పథకం క్రింద ఉపాధి పనులు కల్పించాలని తెలిపారు. ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాలలోనే కొత్త పనులను గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఉపాధి పనులతో కూలీలకు ఆదాయం లభించడంతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా సి.సి. రోడ్లు, మ్యారేజ్ హాళ్లు, ఇతర గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వి.బి.జి. రామ్ జీ పథకం క్రింద అనుమతించిన 375 రకాల పనుల గురించి సర్పంచులకు అవగాహన కల్పించి, పనిదినాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పథకం క్రింద చేపట్టిన పనులకు సంబంధించి 10 రోజులలోనే నగదు ఖాతాలలో జమ అయ్యేలా చర్యలు ఉంటాయని, నిధుల విషయంలో సర్పంచులు ఆందోళన చందవలసిన అవసరం లేదని తెలిపారు. మంజూరైన పనులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సంఘాల (విఓ) భవనాలు, గోదాములు, కమ్యూనిటీ హాళ్లు తదితర అభివృద్ధి పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి అవసరమైన పనులను గుర్తించి, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు వి.బి.జి. రామ్ జీ పథకం మంచి అవకాశమని, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆదర్శ గ్రామంగా ఎంపికైన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు అందజేస్తుందని తెలిపారు. పశువులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటి కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణాన్ని పథకం క్రింద చేపట్టాలని సూచించారు. రైతులు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి 14 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఈ సహాయంతో పాటు సాగు చేసిన పచ్చి గడ్డిని విక్రయించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, జిల్లా పశుసంవర్ధక అధికారి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చెరువులు, కాలువలలో పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన గ్రామ సంఘాల భవనాలు, అదనపు గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వి.బి.జి. రామ్ జీ పథకం క్రింద పనిదినాలను పెంచేందుకు కూలీలకు తగిన సంఖ్యలో మేట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నీటి తొట్లు ఏర్పాటు చేయడంతో పాటు పశుగ్రాసం సాగును ప్రోత్సహిస్తామని, నీటి సంరక్షణలో భాగంగా వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయనైనది*