నవంబర్ 11న నిర్మల్లో బీఆర్ఎస్ ‘రైతు గర్జన’ సభ
- కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై సమరశంఖం.. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు.. భారీగా తరలిరావాలని రైతులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకుల పిలుపు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు నవంబర్ 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ‘రైతు గర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించారు. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.శుక్రవారం నిర్మల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు రాంకిషన్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బల్కా సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి పడగంటి రమాదేవి తదితర నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్కు పేరు వస్తుందనే నీటిని ఎత్తిపోయడం లేదా?
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.......ఎల్నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
నవంబర్ 11న రైతు గర్జన.. భారీగా తరలిరావాలి.........
రైతుల హక్కుల పరిరక్షణతో పాటు రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు నిర్మల్లో రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సభ ద్వారా ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
