- ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ ఎంతో స్ఫూర్తీ దాయకం
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 25: సామాన్యుల విజయ గాథలకు జాతీయవేదికగా "మన్ కీ బాత్" నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు. 12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు. ఈ ఎపిసోడ్ లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని హేవల్ నదిని పునరుజ్జీవింపజేయడానికి స్థానిక ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించడం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందన్నారు.
రాబోయే దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రతి భారతీయుడు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘మన్ కీ బాత్’ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను కోట్లాది మందికి పరిచయం చేసే గొప్ప వేదిక అని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer