📅 Saturday, 07 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్ఎస్ ‘రైతు గర్జన’ సభ
‹
›
District News

ధన్వంతరి జయంతి రోజునా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు తప్పని నిరీక్షణ!

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ధన్వంతరి జయంతి రోజునా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు తప్పని నిరీక్షణ!
  • 25వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. ధన్వంతరికి పూజలు చేసి వినూత్న నిరసన
నిర్మల్ నవంబర్ 7 (సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె శనివారం 25వ రోజుకు చేరుకుంది. ధన్‌తేరస్‌ (ధనత్రయోదశి) – ధన్వంతరి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సమ్మె శిబిరంలో ఉద్యోగులు ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఆరోగ్యానికి అధిదేవుడిగా భావించే ధన్వంతరి జయంతి రోజున ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమకే న్యాయం జరగకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలందించి, అనేకమంది ప్రాణాలను కాపాడిన తమ సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ......ధన్వంతరి దేవుడైనా తమ ఆవేదనను ఆలకించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ హెచ్ ఎం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్‌ను వెంటనే చెల్లించాలి.
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలి.ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు మరోసారి విజ్ఞప్తి చేశారు.