దీపాల పండుగను సమ్మె శిబిరంలోనే జరుపుకున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు
- 28వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు
నిర్మల్ జిల్లా ఇన్ హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొంటున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు దీపావళి పండుగను సమ్మె శిబిరంలోనే జరుపుకున్నారు.
కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన దీపావళి పండుగను ఉద్యోగ భద్రత కోసం రోడ్డుపై టెంట్ కింద నిరసన శిబిరంలో జరుపుకోవాల్సి రావడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె శిబిరంలో దీపాలు వెలిగించి, ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ పండుగను జరుపుకున్నారు. తమ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ........ ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి జరుపుకోవాల్సిన దీపావళి పండుగను సమ్మె శిబిరంలో జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి అంటే చీకటిని తొలగించి వెలుగులు నింపే పండుగ అని, అదేవిధంగా తమ కాంట్రాక్ట్ ఉద్యోగ జీవితాల్లోని చీకటిని తొలగించి రెగ్యులరైజేషన్ రూపంలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పండుగలైనా, పబ్బాలైనా సమ్మె శిబిరంలోనే జరుపుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు...........
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.పెండింగ్‌లో ఉన్న 5 శాతం ఇంక్రిమెంట్,8శాతం లాయల్టీ బోనస్‌ను వెంటనే విడుదల చేయాలి.ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
