శివనగర్–పెద్దకంజర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని బీజేపీ నిరసన దీక్ష
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టెడు మట్టి కూడా తీయలేదు
- ప్రజల బాధలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పట్టడం లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
శివనగర్ నుంచి పెద్దకంజర్ల వరకు రహదారి అధ్వానంగా మారడంతో స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్లపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి శివనగర్–పెద్దకంజర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
