ప్రజావాణిలో ప్రజల సమస్యలను స్వయంగా విన్న ఎస్పీ జి. జానకి షర్మిల
- ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలి – అధికారులకు ఆదేశం
ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అన్నారు.నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు వారికి భరోసా కల్పించాలని, వారి మాటలను ఓపికగా విని సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడమే నిర్మల్ పోలీసుల లక్ష్యమని ఎస్పీ డా. జి. జానకి షర్మిల పేర్కొన్నారు.
