- కిష్టారెడ్డిపేట నుంచి శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప భక్తులు
- పాదయాత్రను ప్రారంభించిన అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
- యాత్ర బృందానికి రూ. 1,00,000 ఆర్థిక సహాయం అందజేత
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట దుర్గామాత దేవాలయం నుంచి కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల వరకు చేపట్టిన ‘బి.హెచ్.ఇ.ఎల్. టెంపుల్ శ్రీ శబరిమల 3వ మహా పాదయాత్ర’ శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాముల మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన భక్తుల బృందానికి తన వంతు సహాయంగా నందారం నరసింహ గౌడ్ రూ. 1,00,000 (లక్ష రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి కాలినడకన శబరిమల వరకు వెళ్లడం సాధారణమైన విషయం కాదని అన్నారు. సుమారు 40 రోజులకు పైగా ఎండనక, వాననక, రాత్రనక పగలనక కఠిన నియమాలతో కాలినడకన సాగించే ఈ పాదయాత్ర కేవలం ఆ మణికంఠుడి దివ్య ఆశీస్సులతోనే విజయవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వాములందరి యాత్ర నిరాటంకంగా కొనసాగి, క్షేమంగా శబరిమల చేరి అయ్యప్ప దర్శనం చేసుకోవాలని, లోక కల్యాణం కోసం భక్తులు చేస్తున్న ఈ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు తో పాటు పలువురు నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
— Vukkalkar VivekStaff Reporter