- అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు నందారం నరసింహ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ ఈ పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి, ఇంతటి ఆత్మీయతతో సత్కరించిన గ్రామ పెద్దలకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు మరియు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. గ్రామంలో భక్తిభావంతో, ఐకమత్యంతో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జగన్మాత దుర్గాదేవి కృపాకటాక్షాలతో ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామం సకల శుభాలతో, సుభిక్షంగా విలసిల్లాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , నందారం శ్రీనివాస్ గౌడ్, ఎన్ ఎన్ జి యువసేన సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter