బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు
బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్‌తో కలిసి బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ, పోలీస్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, మానసిక పరిపక్వత పెరగకపోవడంతో పాటు జీవితంపై సరైన అవగాహన ఏర్పడకుండా వారి భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. నేటి యువత విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ఉన్నత చదువులు చదివి స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించాలని సూచించారు.
బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత బాలిక, బాలుడు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పించాలని, బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం విధించే శిక్షల గురించి వివరించాలని అధికారులకు సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనలో మహిళా, శిశు సంక్షేమ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు కీలక పాత్ర పోషించాలని, బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసినా, ఇప్పటికే జరిగిపోయినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుండి 16వ తేదీ వరకు పాఠశాలలలో, 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. 28వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాల్య వివాహాలకు సంబంధించి చైల్డ్ హెల్ప్‌లైన్ నం.1098 ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో బాల్య వివాహాల నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలని, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ, పోలీస్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
