📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
  • ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకం – జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా లాబ్ధి గ్రామంలో లబ్ధిదారు కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
నిర్మల్ నవంబర్ 08.సాక్షర ప్రతినిధి.ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు.ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఇంటి నిర్మాణ వివరాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారు కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. మిఠాయిలు, పిల్లలకు టపాసులు, నోటుపుస్తకాలు అందజేసి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు. ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో విశేష పురోగతి సాధించేందుకు కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి సంతోషాన్ని అందిస్తున్నామని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబంతో కలిసి వారి సొంతింటిలో దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.లబ్ధిదారు అనూష బాయి మాట్లాడుతూ.. తమ సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పండుగ వేడుకల్లో పాల్గొనడం మరింత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు.అనంతరం గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాబ్ కార్డులు కలిగిన గ్రామస్తులంతా వీబీ-జీ రామ్ జీ పథకం కింద అందుబాటులో ఉన్న ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, గ్రామ సర్పంచ్ శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.