- మూడు నెలల పాటు పంటలు వేయొద్దంటే రైతు కుటుంబాల జీవనాధారం ఏమిటి? – బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చెరుకు రాజ్యం రైతులకు మూడు నెలల భరోసా ఎలా కల్పిస్తారు? ఆర్థిక సాయం ఎప్పుడు, ఎంత అందిస్తారు?
నిర్మల్ నవంబర్ 3 (సాక్షర ప్రతినిధి)రైతులకు సాగునీరు అందించలేని ప్రభుత్వం పంటల సాగు చేయవద్దని సూచించడం దురదృష్టకరమని బహుజన సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చెరుకు రాజ్యం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతే రాజు అని చెప్పుకునే పాలకులు నేడు రైతులను పంటలు సాగు చేయవద్దని చెప్పే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.మూడు నెలల పాటు రైతులు పంటలు వేయకుండా ఉంటే వారి కుటుంబాల జీవనాధారం ఎలా సాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఈ మూడు నెలల పాటు తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించారు. పంటలు సాగు చేయకుండా ఉండాలని సూచిస్తున్న ప్రభుత్వం రైతులకు మూడు నెలల పాటు భరోసా కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, ఆ భరోసా ఏ రూపంలో కల్పిస్తుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులకు ఎంత మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తారు? ఎప్పటి నుంచి అందిస్తారు? అర్హులైన రైతులందరికీ ఈ సాయం అందుతుందా? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కేవలం హామీలు ఇవ్వడం కాకుండా రైతులకు ఆచరణలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది.. వ్యవసాయం బతికితేనే దేశం బతుకుతుంది అని పేర్కొంటూ, రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవాలని చెరుకు రాజ్యం డిమాండ్ చేశారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer