- ఐదు విభాగాల్లో పోటీలు.. ప్రతిభావంతులైన యువతకు రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం
నిర్మల్ నవంబర్ 2 (సాక్షర ప్రతినిధి)యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో తెలంగాణ రాష్ట్ర యువజన సేవల శాఖ మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 3న శాంతినగర్‌లోని జే.వి.ఎన్.ఆర్. పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.30వ జాతీయ యువజనోత్సవం–2027లో పాల్గొనేందుకు ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, కళా నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ యువజనోత్సవంలో ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జానపద నృత్యం, జానపద గానం, చిత్రలేఖనం, కవితా రచన, నుక్కడ్ నాటకం విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు. జానపద నృత్యం, గానంలో ఒక్కో బృందానికి గరిష్ఠంగా 10 మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. చిత్రలేఖనంలో 'వ్యసన రహిత యువత', ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలపై చిత్రాలు రూపొందించాలి. కవితా రచనలో హిందీ, ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషల్లో స్వీయ రచనలకు అవకాశం కల్పించారు. నుక్కడ్ నాటకాల్లో వ్యసన విముక్తి, ప్రభుత్వ పథకాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను ప్రదర్శించవచ్చు.పోటీల్లో పాల్గొనే యువతకు 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని, నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారి సూచించారు. సంబంధిత విభాగాల్లో న్యాయనిర్ణేతలు ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన విజేతలకు డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ప్రతిభావంతులు 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న 30వ జాతీయ యువజనోత్సవంలో పాల్గొనే అవకాశం పొందుతారు.ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, యువజన సంఘాలు, సాంస్కృతిక సంస్థలు యువజనోత్సవంపై విస్తృత ప్రచారం చేపట్టి అర్హులైన యువతను పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని బి. శ్రీకాంత్ రెడ్డి కోరారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer