📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం చేపట్టాలి
‹
›
District News

రోజువారీ లక్ష్యాలతో భూముల రీ సర్వేను వేగవంతం చేయాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రోజువారీ లక్ష్యాలతో భూముల రీ సర్వేను వేగవంతం చేయాలి
  • పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తక్కువ నీటితో పండే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి.. ప్రతి పొలంలో పంట కుంటలు నిర్మించుకోవాలి
నిర్మల్ అక్టోబర్ 30 సాక్షర ప్రతినిధి
భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సర్వేలో పారదర్శకత పాటిస్తూ, భూముల హద్దులను పక్కాగా గుర్తించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం నర్సాపూర్ (జి) మండలంలోని చాక్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం సర్వే చేయాల్సిన భూములు, పట్టా భూములు, ఎస్ఆర్ఎస్పీ భూములు తదితర వివరాలను సమీక్షించారు.
రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా భూముల హద్దులను కచ్చితంగా గుర్తించాలని సూచించారు. సర్వే బృందంలోని సభ్యులందరి పర్యవేక్షణలో, సంబంధిత రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు, రైతుల మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటూ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
సర్వే సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రీ సర్వేలో పాల్గొనే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తప్పనిసరిగా టోపీలు ధరించాలని, తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది ఆరోగ్య భద్రతను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
తక్కువ నీటితో పండే పంటల సాగుకు ప్రాధాన్యం
అనంతరం స్థానిక రైతుతో మాట్లాడిన కలెక్టర్ ఆయన సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతుకు సూచించారు.
వ్యవసాయ క్షేత్రాల్లో పంట కుంటలు (ఫామ్ పాండ్స్) నిర్మించుకోవాలని, వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో సాగుకు వినియోగించుకోవాలని తెలిపారు. పంట కుంటల నిర్మాణం ద్వారా భవిష్యత్తులో నీటి ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సర్వేయర్ విలాస్, సర్పంచ్ సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.