📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
‹
›
State News

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం :
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
  • వారం రోజుల్లో ప్రైవేట్ క్రికెట్ కోచ్‌ల నియామకం.. మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 26: కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ క్రీడాభివృద్ధికి అనువుగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
కామారెడ్డి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శి జీవన్ రెడ్డి, HCA సీఈఓ ఇంతియాజ్ ఖాన్‌లతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరిశీలించారు. స్టేడియంలోని ప్రస్తుత సౌకర్యాలు, క్రికెట్ ప్రాక్టీస్‌కు అవసరమైన మౌలిక వసతులు, పిచ్ నిర్మాణం, ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి, క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..కామారెడ్డి ప్రాంతంలో క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్‌కు మంచి ఆదరణ ఉందని, స్థానిక యువతకు సరైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు అందిస్తే ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రతిభ ఉన్న విద్యార్థులు నాణ్యమైన క్రికెట్ శిక్షణకు దూరం కాకూడదని, వారికి స్థానికంగానే మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణా వేదికలు లేక చాలామంది వెనుకబడుతున్నారని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు అవసరమైన క్రీడా వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ ప్రాక్టీస్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ కోచ్‌ల నియామకం, మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు, క్రికెట్ శిక్షణకు అవసరమైన సామగ్రి సమకూర్చడం వంటి చర్యలతో స్థానిక యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా స్టేడియంలో నాణ్యమైన క్రికెట్ పిచ్ నిర్మాణం చేపట్టి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు, అండర్-19 స్థాయి క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేలా కృషి చేస్తామని అన్నారు. దీనివల్ల కామారెడ్డి యువ క్రీడాకారులకు పోటీ క్రికెట్‌పై అవగాహన పెరగడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు.

క్రీడా రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు, క్రీడా సంస్థల సమన్వయంతో ముందుకు వెళ్తామని షబ్బీర్ అలీ గారు అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం కేవలం క్రీడా మైదానంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రికెటర్లను తయారు చేసే శిక్షణా కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.
HCA కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి సూచనల మేరకు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో వారం రోజుల్లోగా ప్రైవేట్ క్రికెట్ కోచ్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం మూడు నెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన క్రికెట్ సామగ్రిని స్టేడియానికి అందజేస్తామని చెప్పారు.
త్వరలో నిర్వహించనున్న HCA సమావేశంలో కామారెడ్డి స్టేడియంలో క్రికెట్ పిచ్ నిర్మాణం, స్టేడియాన్ని HCA ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ చేపట్టడం వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. అండర్-19 స్థాయి క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ చర్యలతో కామారెడ్డి ప్రాంత యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోటీ క్రికెట్‌లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.