నర్సాపూర్-జి మండల అభివృద్ధికి రూ.1.57 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు
- రాంపూర్‌లో మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం.. రూ.60 లక్షలతో గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన మరోవైపు నర్సాపూర్‌లో రూ.56.85 లక్షలతో బాలికల విద్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం.. ప్రతిభావంతులైన విద్యార్థినులకు సన్మానం, నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
జిల్లా నర్సాపూర్-జి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు నూతన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
మండలంలోని రాంపూర్ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్యకు సంబంధించిన నాలుగు భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు గోదాములకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గ్రామ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై చర్చించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ఇటువంటి భవనాలు, మౌలిక సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అనంతరం నర్సాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56.85 లక్షల వ్యయంతో నిర్మించనున్న బాలికల విద్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాల్లో నిలిచిన కావేరి (ఎంపీసీ), కీర్తన (బైపీసీ) విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
నర్సాపూర్ మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో రాంపూర్ గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి ప్రవీణ్, ఉప సర్పంచ్ కమ్రుద్దీన్, నర్సాపూర్ స్థానిక సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షుడు నరేందర్, బీజేపీ నాయకులు ఠాకూర్ అర్జున్, మహిపాల్, రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, జమాల్, సత్యం చంద్రకాంత్, అనిల్, గోవర్ధన్, శ్రీనివాస్, ప్రణీత్ తదితరులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
